PrayanamTheJourney

భావాల పల్లకిలో ప్రయాణ గీతిక……

  • ఓ అందమైన కష్టమా,
    నీ రాక నిశ్శబ్దంగా మొదలైనా,
    నీవు ఎక్కువకాలం ఉండలేవని తెలిసినా,
    నిన్ను జయించలేరని నువ్వు గర్విస్తున్నా,

    నిన్ను వదిలి,
    గమ్యాన్ని వెతుకుతూ,
    ప్రయాణాన్ని మొదలుపెట్టిన ధైర్యాన్ని అడుగు నువ్వు ఎలా కనిపించావో…

    అక్కడక్కడా నీ స్నేహితులు పలకరించే ప్రయత్నం చేసినా,
    “నిన్ను మేము జయించాం” అని మాటల్ని విసిరినా,
    నవ్వుతూ ముందుకు సాగిన పట్టుదలను అడుగు నీవు ఎలా కనిపించావో…

    ప్రతి కష్టం తుది గమ్యం కాదని,
    ఒక మార్గమే అని,
    మనలోని బలాన్ని గుర్తు చేస్తూ,
    నీ పేరుతో ఓ అధ్యాయాన్ని రాయడానికి వచ్చిన…
    ఓ అందమైన కష్టమా…



  • జీవితంలో ఎదురొచ్చే ప్రశ్నలకు
    ప్రతిసారీ ఓ జవాబు అవసరమా?

    లేదేమో…

    జరిగేది ముందే తెలిసుంటే,
    జాగ్రత్తలు మన దారి చూసేవి కదా…

    కానీ ఎందుకు తెలియదు ?బహుశా
    విధిరాత రాసిన అక్షరాల వంకనేమో…

    కన్నీటి వెనుక దాగిన కోణాలు,
    నవ్వుల వెనుక మిగిలిన బాధలు,
    అన్నీ ప్రశ్నలే…
    ఆ ప్రశ్నలకి సమాధానం అవసరమా?
    లేదేమో…

    ప్రతి ప్రశ్నకు ఒక కథ ఉంది,
    అది మన కథ అయినా,
    మనకు తెలియని వేదన అయినా…

    ఆ ప్రశ్నలు మనతోనే ఉంటాయి,
    నిశ్శబ్దంగా మనల్ని చూస్తూనే ఉంటాయి

    ప్రతి ప్రశ్నకు జవాబు ఉండకపోవచ్చు,
    కానీ ప్రతి ప్రశ్న మనలో మార్పును తెస్తుంది ఏమో…








  • నిశ్శబ్దంలో ప్రయాణిస్తున్న వేళ,
    భావాల అలలు వినిపించాయి.
    మౌనాన్ని తడిమిన శబ్దం,
    నా లోతుల్లో ఉదయించిన క్షణం.

    అది ఊహల తాకిడి కాదు,
    అది కదలిక.
    ఒక కడలి.
    నాలో మొదలైన ఓ భావ ప్రయాణం.